బాలయ్య ఇక అభిమానులను కొట్టరట...

Thursday Oct 12, 2017
Balakrishna original

ఇటీవల బాలయ్య తరచూ తన అభిమానుల చెంపలు పడేల్...పడేల్మనిపిస్తుండటంతో ఆయనపై అభిమానులు కూడా ఆగ్రహంగా ఉండటం సహజమే. ఆయన దురుసుతనం గురించి అన్ని న్యూస్ ఛానల్స్, దినపత్రికలలో ప్రముఖంగా వార్తలు వస్తుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయనను మృదువుగా హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. అది నిజమో కాదో తెలియదు కానీ, మీడియాలో తన గురించి వస్తున్న వార్తలపై బాలయ్య స్పందించారు.

“నాకు అభిమానులంటే చాలా ఇష్టం కనుక వారికి సమీపంలో ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఒకప్పుడు నా చుట్టూ ఉండే బౌన్సర్లను తొలగించాను. ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు నాకు షేక్ హ్యాండ్ ఇవ్వాలనో లేదా నాతో సెల్ఫీలు తీసుకోవాలనో లేదా నన్ను ఇంకా దగ్గరగా చూడాలనే కోరికతో అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ నా కాళ్ళను త్రొక్కేస్తుంటారు. ఒక్కోసారి అన్ని వైపుల నుంచి మీదకు ఎగబడుతుంటారు. వారు ఆవిధంగా ప్రవర్తించడం సహజమే కానీ దాని వలన నేను పడే ఇబ్బందిని ఎవరూ గుర్తించరు. నేను ఎంతగా వారిస్తున్నా ప్రతీసారి ఇలాగే జరుగుతుంటుంది. ఒక్కోసారి సహనం కోల్పోయినప్పుడు వారు నా అభిమానులే కదా..అని ఒక్కటి వేస్తే మీడియాకు అదే బాగా కనబడుతుంది. దానికే వారు చిలవలుపలవలుగా కధలు అల్లేసి వేసేస్తుంటారు తప్ప నేను పడుతున్న ఇబ్బందిని గుర్తించరు.

ఏమైనప్పటికీ నా అభిమానులంటే నాకు ప్రాణం. వారిని కొట్టడం నాకు సరదా కాదు. కనుక ఈ సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు మళ్ళీ బౌన్సర్లను నియమించుకోవలసిందిగా కొందరు సన్నిహితులు సలహా ఇచ్చారు. నేను కూడా అదే మంచిదని భావిస్తున్నాను. కానీ అభిమానులకు దూరంగా ఉండాలనే ఆలోచనే కాస్త బాధ కలిగిస్తోంది,” అని బాలయ్య చెపినట్లు ఆయన సన్నిహితులు ఒకరు మీడియాకు తెలిపారు.