ఆ సినిమాకు బాలయ్యే నిర్మాతా?

Monday Oct 09, 2017
Balakrishna mokshgna original

నందమూరి బాలకృష్ణను ఇంతవరకు సినిమా నటుడిగానే చూశాము కానీ త్వరలో నిర్మాతగా కూడా చూడబోతున్నాము. త్వరలో ఆయన తమ స్వంత సినీ నిర్మాణ సంస్థను ఏర్పాటుచేయబోతున్నారుట! దానికి బ్రహ్మతేజ ప్రొడక్షన్స్ అని పేరు ఖరారు చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది తన కొడుకు మోక్షజ్ఞ సినీరంగంలోకి ప్రవేశిస్తారని బాలయ్య ఇప్పటికే ప్రకటించారు. అతని మొదటి చిత్రాన్ని తమ స్వంత బ్యానర్ లోనే నిర్మించాలని బాలయ్యబాబు భావిస్తున్నట్లు సమాచారం. అయితే కొత్త నిర్మాణసంస్థ, కొత్తహీరోతో సినిమా తీయడం కాస్త రిస్క్ ఎక్కువ గనుక, తమ బ్యానర్ లో మొట్టమొదటి చిత్రంగా ఎన్టీఆర్ బయోపిక్ తీసి దానిలో తాను, మోక్షజ్ఞ కలిసి నటిస్తే మంచిదని బాలయ్య ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆ సినిమాకు సరైన దర్శకుడు దొరికితే వెంటనే దాని కోసం ఏర్పాట్లు మొదలుపెట్టడానికి ఆయన సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది.

 

సినీ పరిశ్రమలో దాదాపు సీనియర్ హీరోలందరికీ స్వంత బ్యానర్లున్నాయి. కనుక బాలయ్య కూడా అటువంటి ఆలోచన చేయడం మంచిదే. ఎలాగూ మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడు కనుక స్వంత బ్యానర్ ఉన్నట్లయితే అది అతనికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సులువుగా ఇండస్ట్రీలో సెట్ అయిపోవడానికి వీలు కల్పిస్తుంది.

 

ఒకవేళ బాలయ్య నిర్మాతగా తమ మొదటి చిత్రం ఎన్టీఆర్ బాయోపిక్ నే తీయడం ఖాయం అయినట్లయితే, అప్పుడు 2018లో ఎన్టీఆర్ పై ఒకేసారి రెండు సినిమాలు వచ్చినట్లవుతుంది. బాలయ్య తీయబోయే సినిమా ఎన్టీఆర్ జీవితంలో పాజిటివ్ పాయింట్స్ కవర్ చేస్తే, వర్మ చిత్రంలో ఎన్టీఆర్ జీవిత చరమాంకంలో ఎదుర్కొన్న విషాదకర ఘటనలను చూపించబోతున్నాడు. కనుక బాలయ్య సినిమాకు అది సీక్వెల్ గా భావించవచ్చు. అయితే వర్మ ఇప్పటికే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీయడానికి ఏర్పాట్లు మొదలుపెట్టేశాడు కనుక ముందుగా అదే రిలీజ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ లెక్కన మనం మొదట రెండవ పార్ట్ చూసిన తరువాత మొదటి పార్ట్ చూడవలసి వస్తుందేమో?