భరత్ మార్చిలో వస్తాడేమో?

Wednesday Oct 11, 2017
Bharat ane nenu original

మహేష్ బాబు-కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భరత్ అనే నేనుచిత్రాన్ని మొదట జనవరిలో సంక్రాంతి పండుగకు విడుదల చేయాలనుకొన్నారు. కానీ ఈసారి సంక్రాంతి పండుగకు పవన్ కళ్యాణ్, బాలకృష్ణలతో సహా ఇంకా అనేకమంది పెద్దాచిన్నా హీరోల సినిమాలు విడుదలవుతున్నందున ‘ఈ చిత్రాన్ని మార్చి నెలలో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. దాని ప్రీ-రిలీజ్ బిజినెస్ లో మార్చి 27వ తేదీ అని చెప్పుకొంటున్నట్లు తాజా సమాచారం. అయితే ఈ విషయం అధికారికంగా ఇంకా దృవీకరించవలసి ఉంది.

ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో దీని కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సెట్ వేసి దానిలో మహేష్ బాబు, పోసాని కృష్ణ మురళి, జీవ,బెనర్జీ, బ్రహ్మాజీ తదితరులున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఈ షెడ్యూల్ పూర్తి చేసుకొని విదేశాలలో పాటలు చిత్రీకరించేందుకు బయలుదేరబోతున్నారు. ఈ సినిమాలో కియరా అద్వానీ మహేష్ బాబుకు జంటగా నటిస్తోంది.   

దీనిని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.