మొదట హోటల్ బిజినెస్ పెట్టుకొందామనుకొన్నా: ప్రభాస్

Tuesday Oct 10, 2017
Prabhas bahubali original

2002లో ఈశ్వర్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ అందగాడు ప్రభాస్ ఇప్పుడు బాహుబలిగా ఎదిగాడు. కానీ ఆ భారం మోయలేకపోతున్నానని చెప్పడమే విశేషం. చాలా అరుదుగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చే ప్రభాస్ బాహుబలి తరువాత ఎక్కడకు వెళ్ళినా మీడియాతో మాట్లాడక తప్పడం లేదు. అయన తాజా ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

మా నాన్నగారు, పెద్దనాన్నగారు సినీ పరిశ్రమలోనే ఉన్నందున నన్ను కూడా చేరమని అడుగుతుండేవారు. కానీ ‘అన్ని కెమెరాలు, లైట్లు, అంతమంది మనుషులను ఎదురుగా పెట్టుకొని ఏవిధంగా నటిస్తున్నారని’ నేను ఎదురుప్రశ్నించేవాడిని. కెమెరాల ముందు నిలబడి నటించడం నా వల్ల కాని పని అని చెప్పేశాను. నా స్నేహితులు, బంధువులకు కూడా అదే మాట చెపుతుండేవాడిని. ‘మరి ఏమి చేస్తావ్?’ అని అడిగితే ‘మా ఇంట్లో అందరికీ రుచికరమైన భోజనం అంటే చాలా ఇష్టం కనుక హోటల్ బిజినెస్ పెట్టుకొంటానని చెప్పేవాడిని,” అని ప్రభాస్ నవ్వుతూ చెప్పారు.          

‘మరి సినిమాలలో రావడానికి కారణం ఏమిటి?’ అనే ప్రశ్నకు “ఒకరోజు మా పెద్దనాన్నగారు బాపు దర్శకత్వంలో చేసిన సినిమాను నేను చూస్తున్నప్పుడు ఆయన పాత్రను నన్ను ఊహించుకొన్నాను..దానితో గొప్ప అనుభూతి పొందాను. అప్పుడే సినిమాలలో నటించాలని నిర్ణయించుకొన్నాను,” అని చెప్పారు.

“నా సినిమాలకు బోలెడుమంది వచ్చి చూడాలని కోరుకొంటాను కానీ వారి ముందు నిలబడి ధైర్యంగా మాట్లాడలేను. నేటికీ జనాల ముందు నిలబడి మాట్లాడాలంటే బెరుకే నాకు. కానీ మెల్లమెల్లగా మాట్లాడటం అలవాటు చేసుకొంటున్నాను,” అని ప్రభాస్ చెప్పారు.

‘బాహుబలి వంటి బారీ సినిమా చేసిన తరువాత, దాని ప్రభావం మీమీద, మీ ఇతర సినిమాలపై ఉంటుందని మీరు భావిస్తున్నారా?’ అనే ప్రశ్నకు సమాధానం చెపుతూ, “ఆ భయం బాహుబలితో మొదలవలేదు. ప్రతీ సినిమాతోను ఉంటుంది. బాహుబలి మొదటి పార్ట్ చేస్తున్నప్పుడు అది హిట్ అవుతుందా లేదా అనే ఆందోళన ఉండేది. రెండవ పార్ట్ చేస్తున్నపుడు మొదటిపార్ట్ కంటే గొప్పగా ఉంటుందా లేదా? లేకపోతే నా పరిస్థితి ఏమిటి? అనే భయం ఉండేది. ఇప్పుడు బాహుబలితో నాపై అంచనాలు బారీగా పెరిగిపోయాయి కనుక ‘సాహో’ చేస్తున్నప్పుడు వాటిని నేను అందుకోగలనా లేదా? అనే భయం ఉంది. ఇది నిరంతరంగా కొనసాగేదే కనుక ఆందోళన చెంది ప్రయోజనం లేదని గ్రహించిన తరువాత మనసు తేలికపడింది,” అని ప్రభాస్ చెప్పారు.