ఇంతోటి పాత్రకు అంత బిల్డప్ ఎందుకో?

Tuesday Oct 31, 2017
Garudavega %282%29 original

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘పి.ఎస్.వి.గ‌రుడ‌వేగ 126.18ఎం’ చిత్రం నవంబర్ 3న విడుదల కాబోతోంది. దానిలో పూజా కుమార్ డాక్టర్ రాజశేఖర్ భార్యగా నటించింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తన కెరీర్, ఈ సినిమాలో తన పాత్ర గురించి చెప్పుకొన్న మాటలు విన్నట్లయితే ఎవరికైనా నవ్వొస్తుంది.

ఆమె చేసింది ఎటువంటి ప్రాధాన్యం లేని గృహిణి పాత్రే అయినా అదేదో చాలా గొప్ప పాత్ర అన్నట్లు, “ఒక పక్క భర్తకు ఏమవుతుందో ఆదుర్దా పడుతూ, మరోపక్క భర్త ప్రేమ కోసం పరితపించే పాత్ర. నాది. ఇంతకు ముందు చాలా మంది దర్శకులు నాకు కధలు వినిపించారు కానీ వాటిలో ఏవీ నాకు నచ్చకపోవడంతో నేను అంగీకరించలేదు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు నా పాత్రకు సంబంధించి 120 పేజీలున్న స్క్రిప్ట్ బుక్ పంపించారు. అది చదివిన తరువాత సినిమాలో నా పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో గ్రహించి అంగీకరించాను,” అని చెప్పింది పూజా కుమార్.

ఫ్యామిలీ డ్రామా లేదా కామెడీ సినిమాలలో గృహిణి పాత్రకు ఏమైనా ప్రాధాన్యం ఉండవచ్చునేమో కానీ పూర్తిగా హాలీవుడ్ స్థాయి యాక్షన్ సినిమాలో గృహిణి పాత్రకు ఏమి ప్రాధాన్యం ఉండదని ఏమాత్రం సినిమా పరిజ్ఞానం ఉన్నవారైనా చెప్పగలరు. ఆ మాత్రం దానికి 120 పేజీల బౌండ్ స్క్రిప్ట్ అంటే నవ్వుకోకమానరు.

ఇక టాలీవుడ్ లో అవకాశాల కోసం అనేకమంది చిన్నా, పెద్ద హీరోయిన్లే దర్శకులు, నిర్మాతలు, హీరోల చుట్టూ తిరుగుతుంటారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇంతవరకు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయని ఆమె చుట్టూ దర్శకులు తిరిగారని చెప్పుకోవడం హాస్యాస్పదంగానే ఉంది. ఎలాగూ మరో మూడు రోజులలో గరుడవేగ రిలీజ్ అవుతోంది. కనుక ఆమె గొప్పదనం ఏమిటో...ఆమె పాత్ర గొప్పదనం ఏమిటో తేలిపోతుంది. అంతవరకు ఆమె ఎన్నైనా చెప్పుకోవచ్చు. 

ఇది చదివారా?  బోయపాటితో మహేష్ సినిమా ఖాయమేనట