త్రివిక్రముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు

Tuesday Nov 07, 2017
Trivikram srinivas original

ప్రముఖ సినీ కధారచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా అభిమానులందరి తరపున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
 
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని టాప్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ కూడా ఒకరని అందరికీ తెలుసు. ఆయన సినీరచయితగా ఎంత గొప్ప కధలను అందించారో, దర్శకుడుగా కూడా మంచి చిత్రాలను అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. విచిత్రమైన విషయం ఏమిటంటే ఒకపుడు ఆయన పోసాని కృష్ణమురళి దగ్గర సహాయకుడిగా పనిచేసేవారు. కానీ ఇప్పుడు ఆయనే త్రివిక్రమ్ సినిమాలలో నటిస్తున్నారు. 

1999లో స్వయంవరం సినిమాకు రచయితగా తమిళనాడు కెరీర్ మొదలుపెట్టిన త్రివిక్రమ్ ‘నిన్నే ప్రేమిస్తా’, ‘నువ్వు నాకు నచ్చావ్’ ‘వాసు’, ‘మన్మధుడు’, ‘మల్లీశ్వరి’, ‘జై చిరంజీవ’ వంటి సూపర్ హిట్ సినిమాలకు కధ, డైలాగ్స్ వ్రాశారు. 2002లో మొట్టమొదటిసారిగా ‘నువ్వు నువ్వే’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తరువాత మళ్ళీ 2005లో ‘అతడు’ సినిమాతో పూర్తిస్థాయి దర్శకుడిగా బిజీ అయిపోయారు. ఆయన దర్శకత్వంలో ‘జల్సా’, ‘ఖలేజా’ ‘జులాయి’, ‘అత్తారింటికి దారేది’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘అ..ఆ..’ వచ్చిన  చిత్రాలలో ఒక్క ఖలేజా తప్ప మిగిలినవన్నీ సూపర్ హిట్స్ అని అందరికీ తెలుసు. 

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఒక చిత్రం చేస్తున్నారు. దాని తరువాత ఎన్టీఆర్ తో మరో చిత్రం చేయబోతున్నారు. కెరాఘవేంద్రరావు, దాసరి నారాయణ రావు వంటి పాతతరం దర్శకుల తరువాత మళ్ళీ ఆ స్థాయిలో వరుసగా హిట్స్ అందిస్తున్న దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరుగా నిలవడం చాలా గొప్ప విషయమే. త్రివిక్రమ్ నుంచి భవిష్యత్ లో మరిన్ని మంచి సినిమాలు వస్తాయని ఆశిద్దాం.

ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సినిమా పేరు ప్రకటించి దాని ఫస్ట్-లుక్ విడుదల చేస్తారని పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు కానీ అటువంటి ఆలోచనలు ఏవీ చేస్తున్నట్లు లేదు. ముందే ప్రకటించినట్లుగా కేవలం ఆ సినిమాలో మొదటిపాటను విడుదల చేశారు.