అమెరికాలో స్పైడర్ హంగామా!

Wednesday Sep 13, 2017
Mahesh babu spyder original

స్పైడర్ తెలుగు, తమిళ వెర్షన్స్ రెండూ ఒకేసారి ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నాయి. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో 600 ధియేటర్లలో విడుదల కాబోతోంది. అమెరికాలో తెలుగువారు కూడా స్పైడర్ చిత్రం కోసం చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు కనుక అక్కడ 250 ప్రధాన నగరాలు, పట్టణాలలో సుమారు 650 ధియేటర్లలో విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఒక తెలుగు సినిమా తెలుగు రాష్ట్రాలలో 600 ధియేటర్లలో విడుదల కావడం సహజమే కానీ ఎక్కడో అమెరికాలో కూడా అదే స్థాయిలో విడుదల కావడం సామాన్యమైన విషయమేమీ కాదు. ఇంతకు ముందు బాహుబలి మాత్రమే అన్ని ధియేటర్లలో విడుదలైంది. దాని తరువాత ఇప్పుడు మహేష్ బాబు నటించిన స్పైడర్ విడుదలవుతోంది.
స్పైడర్ తెలుగు వెర్షన్ ప్రపంచ వ్యాప్తంగా 1,250 ధియేటర్లలో విడుదలవుతుంటే, తమిళ్ స్పైడర్ కూడా అమెరికాలో 160 ప్రధాన ప్రాంతాలలో విడుదలకాబోతోంది. అంటే తెలుగు తమిళ్ వెర్షన్స్ రెండూ కలిపి ఒక్క అమెరికాలోనే దాదాపు 760 ధియేటర్లలో విడుదల కాబోతున్నాయన్న మాట. అమెరికాలో తెలుగు సినిమాలు ఈ స్థాయిలో విడుదలవుతుండటం, అవి సూపర్ హిట్ అయ్యి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండిస్తుండటం చాలా గొప్ప విషయమే. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరుకొంటోందని చెప్పడానికి ఇదే ఒక తాజా నిదర్శనంగా నిలుస్తుంది.