కాజల్ స్థానంలో నివేదా థామస్?

Thursday Nov 02, 2017
Sharwanand original

ఈ ఏడాది మొదట్లోనే ‘శతమానం భవతి’ తో హిట్ కొట్టిన శర్వానంద్, మళ్ళీ ‘మహానుభావుడు’ చిత్రంతో మరో హిట్ కొట్టాడు. రెండు వరుస హిట్స్ కొట్టిన అతనితో జత కట్టడానికి అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది కానీ కాజల్ అగర్వాల్ మాత్రం సింపుల్ గా ‘నో’ చెప్పేసిందిట.

ఎందుకంటే...సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఆ సినిమాలో శర్వానంద్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. దానిలో ఒకటి కాస్త పెద్ద వయసున్న పాత్ర అట. ఆ పాత్రకు హీరోయిన్ గా చేయడం అంటే కాజల్ అగర్వాల్ కూడా ముసలివేషం కట్టక తప్పదు. హీరోలు ఎటువంటి పాత్రలు చేసినా పరువాలేదు కానీ ఒకసారి ఏ హీరోయిన్ అయినా అటువంటి పాత్ర చేసి మెప్పిస్తే ఇక ఎప్పుడూ అటువంటి పాత్రలే వస్తాయనే అనేకసార్లు నిరూపితమైంది. మరికొన్నేళ్ళు హీరోయిన్ గా గ్లామర్ పాత్రలు చేసుకోవాలనుకొంటున్న కాజల్ అగర్వాల్ అందుకే శర్వానంద్ సినిమాకు ‘నో’ చెప్పింది.

అయితే శర్వానంద్ చిన్న హీరో కనుకనే అతనితో చేయడానికి ఇష్టంలేక ‘నో’ చెప్పిందనే టాక్ కూడా వినిపించింది కానీ అది నిజం కాకపోవచ్చు. అయితే ఇదివరకు మహేష్ బాబు, వెంకటేష్ నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో వెంకటేష్ పక్కన ఇటువంటి పాత్రే చేయడానికి చాలా మంది హీరోయిన్లు నిరాకరిస్తే, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొన్న అంజలి మంచి పేరు సంపాదించుకొంది. అదిచూసి ఆ పాత్రను వద్దనుకొన్న హీరోయిన్లు తరువాత తాపీగా బాధపడ్డారుట. శర్వానంద్ సినిమాను కాదనుకొన్నందుకు బహుశః కాజల్ అగర్వాల్ కూడా అలాగే తరువాత తాపీగా బాధపడుతుందేమో?    

ఇక కాజల్ అగర్వాల్ ‘నో’ చెప్పేసిన పాత్రకు నివేదా థామస్ ను తీసుకోబోతున్నట్లు తాజా సమాచారం. సినిమాలో యంగ్ శర్వానంద్ పక్కన ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ షాలినీ పాండేను ఇప్పటికే ఖాయం చేసేశారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మించబోతున్నారు.

దీని తరువాత శర్వానంద్ అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగతో ఒకటి, హను రాఘవపూడితో మరొకటి చేయడానికి అప్పుడే ప్లాన్ చేసుకొంటున్నాడుట!

ఇది చదివారా? చైతు-సమంతల రిసప్షన్ 12న