పవన్ కళ్యాణా మజాకా?

Tuesday Sep 12, 2017
Pawan kalyan original

అందరికీ తెలిసిన పవన్ కళ్యాణ్ గురించి మళ్ళీ చెప్పుకోవడం అంటే సూర్యుడి, చంద్రుడిని కొత్తగా పరిచయం చేస్తున్నట్లే అవుతుంది. ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకంవంటిది. త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పేసి ప్రత్యక్ష రాజకీయాలలోకి రాబోతున్నారు కనుక ఇంకా ఓపెన్ అయిపోతారు. ఆయన జనసేన పార్టీని ప్రకటించినప్పుడు, తరువాత ఎన్నికలలో పోటీ చేయడం లేదని చెప్పినప్పుడు “మూడు రోజుల ముచ్చట అప్పుడే అయిపోయిందా?” అంటూ అందరూ నవ్వుకొన్నారు.
ఆ తరువాత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం, బిజెపిలకు మద్దతు ఇచ్చి వాటి తరపున ఉదృతంగా ప్రచారం చేసినప్పుడు ఎక్కడకు వెళ్ళినా వేలాదిగా తరలివస్తున్న ఆయన అభిమానులను, పవన్ కళ్యాణ్ ప్రసంగాలకు వారి స్పందనను చూసి నరేంద్ర మోడీ కూడా ఆశ్చర్యపోయారు.
ఎన్నికలు పూర్తయిపోయిన తరువాత పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేసుకోవడంలో బిజీ అయిపోవడంతో, “ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పి ప్రజా సమస్యలపై ఎందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించడం లేదు అని అందరూ ఆయనను ప్రశ్నించడం మొదలుపెట్టారు. అయితే అవసరమైనప్పుడు కేవలం ప్రధాన సమస్యలపై మాత్రమే గట్టిగా స్పందిస్తూ తెలుగుదేశం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.
జనసేన పార్టీ నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందానికి అంతే లేకుండా పోయింది. అది కూడా మిగిలిన పార్టీలకు భిన్నంగా సామాన్య ప్రజలు, అభిమానుల నుంచి కార్యకర్తలను, నాయకులను ఎన్నుకొంటూ పార్టీని నిర్మించుకోవడం రాజకీయాల పట్ల అయన నిబద్దతను, ప్రజల పట్ల నమ్మకాన్ని చాటి చెప్పాయి. సాధారణంగా ఇతర పార్టీల నుంచి నేతలను, వారి అనుచరులను దిగుమతి చేసుకొని పార్టీని నిర్మించుకోవడానికి అలవాటుపడిన పార్టీలు, వాటి నేతలు పవన్ కళ్యాణ్ తన పార్టీ నిర్మాణం చేసుకొంటున్న తీరును చూసి పెదవి విరుస్తున్నారు.
అయినా ప్రజలు, తన అభిమానులే తన సైన్యంగా జనసేనను నిర్మించుకొంటున్నారు. ఆ అభిమానాన్ని ట్వీట్టర్ లెక్కలలో కొలిచి చూస్తే ఆయనకు మరెవరూ సాటిరారని నిరూపిస్తూ 20 లక్షల మంది ఫాలోవర్స్ మార్క్ ను దాటేశారు. పవన్ కళ్యాణ్ ఆగస్ట్ 2014లో ట్వీట్టర్ లో ఖాతా తెరిచాడు. మొదట్లో చాలా నెలల వరకు దానిలో పవన్ కళ్యాణ్ ఏమీ పోస్ట్ చేయలేదు కానీ ఆయనను ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
గత కొంతకాలంగా అడపాదడపా పోస్టులు పెడుతుండటంతో ఆయనను ఫాలో అయ్యేవారి సంఖ్య శరవేగంగా పెరుగసాగింది. అలాగా పెరిగి పెరిగి చివరికి ఏకంగా అభిమానుల సంఖ్య 20 లక్షలకు చేరుకొంది. ఏ మనిషి జీవితానికైనా ఇంతకంటే గొప్ప వరం ఇంకేముంటుంది? ఇన్ని లక్షలమంది అభిమానం స్వంత చేసుకొన్న పవన్ కళ్యాణ్ నిజంగా గ్రేట్..హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్.