హాస్యనటుడిపై కేసు నమోదు

Wednesday Oct 11, 2017
Santhanam original

తెలుగు సినిమాలలో బ్రహ్మానందం ఎలాగో అలాగే తమిళ సినిమాలలో కమెడియన్ సంతానం కూడా తప్పనిసరి. ఆయన దాదాపు అందరు ప్రముఖ హీరోల పక్కన కమెడియన్ గా కనిపిస్తుంటాడు. ఒక ఆస్తి వివాదంలో తనను మోసం చేసిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి షణ్ముగసుందరంతో అయన నిన్న గొడవ పడ్డాడు. చెనై సమీపంలోని కోవూర్ లో గల ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి కార్యాలయానికి వెళ్ళి అతనితో వాగ్వాదానికి దిగినప్పుడు ఆవేశంలో అతనిపై సంతానం దాడి చేశాడు. మద్యలో కలుగజేసుకొన్న అతని లాయర్ పై కూడా సంతానం దాడి చేయడంతో వారిద్దరూ గాయపడ్డారు. ఆ గొడవలో సంతానం కూడా గాయపడ్డారు. తరువాత ఇద్దరూ స్థానిక వలసరవాక్కం పోలీస్ స్టేషన్ లో ఒకరిపై మరొకరు పిర్యాదు చేసుకోవడంతో ఇద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని భయపడిన సంతానం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి, మద్రాస్ హైకోర్టులో నిన్న ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకొన్నాడు.

సినీ పరిశ్రమలో సంతానం వంటి ప్రముఖ నటులు చాలా బాగానే సంపాదించుకొంటారు కనుక దానిని తమ భవిష్యత్ అవసరాల కోసం రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ లేదా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ లోనో పెడుతుంటారు. కానీ షూటింగుల కారణంగా క్షణం తీరికలేకుండా గడుపుతుంటారు కనుక ఎవరినో ఒకరిని నమ్మి ఏదో ఒకదానిలో పెట్టుబడులుపెట్టి ఈవిధంగా మోసపోయి ఇబ్బందులలో పడుతుంటారు. ఇదివరకు ప్రముఖ సినీ నటి అనుష్క కూడా విశాఖలోని భీమిలి వద్ద ఒక స్థలం కొనుగోలు చేసి మోసపోయింది. వేరే ఎవరికో చెందిన స్థలాన్ని బ్రోకర్ ఆమెకు అంటగట్టేశాడు. ఆ విషయం తెలుసుకొన్న సదరు స్థలం యజమాని కోర్టులో కేసు వేశాడు. దానిని ఆమె కోర్టు బయట పరిష్కరించుకోవలసి వచ్చింది. సంతానం కూడా రియాల్టర్ చేతిలో మోసపోయినప్పటికీ, ఆవేశంతో దాడి చేయడం వలన చిక్కుల్లో పడ్డాడు పాపం. రాజుల సొమ్ము రాళ్ళ పాలన్నట్లు, సినీ తారల సొమ్ము మోసగాళ్ళ పాలు అనుకోవాలేమో?