నటీనటులు: డాక్టర్ రాజశేఖర్, పూజా కుమార్, శ్రద్ధాదాస్,
నాజర్, పోసాని, అలీ, షాయాజీ షిండే, పృథ్వీ, కిషోర్, అదిత్ అరుణ్ తదితరులు.
కథ, స్క్రీన్-ప్లే, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
నిర్మాత: ఎం.కోటేశ్వర్ రాజు
సంస్థ: శివాని శివాత్మిక ఫిలింస్, జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
కెమెరా: అంజి, సురేష్ రగుతు, శ్యామ్ ప్రసాద్, గికా, బాకుర్
డాక్టర్ రాజశేఖర్ దాదాపు 10-15 ఏళ్ళుగా ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయారు.
ఈ పరిస్థితిలో మళ్ళీ తన సత్తాను చాటుకొనేందుకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో జేమ్స్
బాండ్ తరహా చిత్రం ‘పి.ఎస్.వి.గరుడవేగ 126.18 ఎమ్’ చిత్రం చేశారు. డాక్టర్ రాజశేఖర్ సినీ కెరీర్ ఈ సినిమాపైనే ఆధారపడి
ఉన్నందున ఆ దంపతులు ఇరువురూ దీనిపై చాలా ఆశలు పెట్టుకొన్నారు. సినిమాకు పాజిటివ్
టాక్ వస్తోంది కనుక దీనితో ఆయన కెరీర్ మళ్ళీ గాడిలో పడినట్లే భావించవచ్చు.
కధ: చంద్రశేఖర్ (డాక్టర్ రాజశేఖర్)
ఎన్.ఐ.ఎ.అధికారి కనుక సీక్రెట్ మిషన్స్ లో పాల్గొంటుంటాడు. తనకు అప్పగించిన
మిషన్స్ ఎంత క్లిష్టమైనవైనా సరే సమర్ధంగా పూర్తిచేయగల సత్తా ఉన్న అధికారిగా
సంస్థలో మంచిపేరు తెచ్చుకొన్నప్పటికీ, పని ఒత్తిడి కారణంగా భార్య స్వాతి (పూజా
కుమార్)కు సమయం కేటాయించలేకపోతాడు. ఆ కారణంగా ఆమె అతని నుంచి విడాకులు
తీసుకోవడానికి సిద్దపడుతుంది. ఆమెను వదులుకోలేక తప్పనిసరి పరిస్థితిలో తన
ఉద్యోగానికి రాజీనామాకు సిద్దపడతాడు. కానీ అక్కడి నుంచే అసలు కధ మొదలవుతుంది. సరిగ్గా
అప్పుడే ఒక భయానకమైన కుట్ర గురించి చంద్రశేఖర్ తెలుసుకొంటాడు. ఆ కారణంగా తన
భార్యను దూరం చేసుకొని తన వృత్తిధర్మం పాటిస్తాడా లేక భార్య కోసం తన బాధ్యతలను
పక్కన పెడతాడా? అనేది తెరపై చూస్తేనే బాగుంటుంది.
విశ్లేషణ: సినిమాలో పూజా కుమార్ పాత్ర లేకపోతే
పూర్తిగా ఇది హాలీవుడ్ సినిమాకు డిటో అని చెప్పవచ్చు. అయితే హాలీవుడ్ యాక్షన్ సినిమాలలో
కూడా ఇటువంటి పాత్రలు, సెంటిమెంట్స్ ఉంటాయి కనుక ఈ సినిమాలో భార్యాభర్తల మద్య నడిచే
కధను అంగీకరించవచ్చు. ఇంత సీరియస్ సినిమాను కామెడీ లేకుండా చూడమంటే మన ప్రేక్షకులు
చూడరు. వారిని ధియేటర్లలో కూర్చోబెట్టడం, మెప్పించడం కష్టమే కనుక కాస్త కామెడీ
చేయక తప్పలేదు. కానీ అది అసలు కధను దారి తప్పించకుండా, డామినేట్ చేయకుండా దర్శకుడు
ప్రవీణ్ సత్తారు చాలా జాగ్రత్తపడ్డాడు.
ఇక మొదటి హాఫ్ లో చకచకా జరుగుతున్న యాక్షన్
సన్నివేశాలను చూస్తుంటే నిజంగా హాలీవుడ్ సినిమా చూస్తున్న అనుభూతే కలుగుతుంది. సెకండ్
హాఫ్ లో కాస్త థియరీ పాఠాలు ఎక్కువైనప్పటికీ, కధకు అవి అవసరం కనుక తప్పలేదు. వాటిని
మాస్ ప్రేక్షకులు క్యాచ్ చేయలేకపోయినా, అత్యద్భుతమైన యాక్షన్ సీన్స్ వారిని
కట్టిపడేస్తాయి. మొత్తం మీద సినిమా ఊహించిన దానికంటే చాలా బాగుంది. దీనితో డాక్టర్
రాజశేఖర్ తన స్టామినా ఏమిటో మళ్ళీ నిరూపించి చూపుకొన్నారు. ఇటీవల విడుదలైన ఇటువంటి
ఒక చిత్రంతో పోలిస్తే ఇది ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది.
పెర్ఫార్మెన్స్: డాక్టర్ రాజశేఖర్ యాక్షన్
సీన్స్ ను ఎంత గొప్పగా చేశాడో, ఎమ్మోషనల్ సీన్స్ కూడా అంతే గొప్పగా చేశాడు. ఈ సినిమాకు
ఇంత మంచి ఫీల్ వచ్చింది అంటే అది ఆయన అద్భుతమైన నటనవల్లనే అని చెప్పుకోకతప్పదు. ఈ
సినిమాలో డాక్టర్ రాజశేఖర్ భార్యగా పూజా కుమార్ పడిన మానసిక ఘర్షణ చాలా అర్ధంవంతంగా
ఉంది. అయితే ఆమె నుంచి పూర్తిస్థాయిలో నటనను రాబట్టడంలో దర్శకుడు కాస్త అశ్రద్ధ
చూపినట్లు కనిపిస్తుంది. ఇక పోసాని, పృధ్వీ, ఆలీ, నాజర్, అదిత్ అరుణ్, కిషోర్
అందరూ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సన్నీ లియోన్ డ్యాన్స్ బాగానే ఉంది
కానీ ఈ సినిమాకు అది అవసరమా అనిపిస్తుంది.
మ్యూజిక్, కెమెరా: ఇటువంటి సినిమాలకు ఆ
ఫీల్ తెప్పించగలిగేది ఈ రెండే. ముఖ్యంగా ఇటువంటి సినిమాలో పాటలకు ఇచ్చే మ్యూజిక్
కంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా కీలకపాత్ర వహిస్తుంది. అది చాలా అద్భుతంగా
కుదిరింది. అలాగే ఈ సినిమాకు కెమెరాలను హ్యాండిల్ చేయడానికి అంతమందిని ఎందుకు
ఉపయోగించుకొన్నారో సినిమా చూస్తేనే అర్ధం అవుతుంది. వారి పనితనంతో ఈ సినిమా
హాలీవుడ్ సినిమాను తలపించిందంటే అతిశయోక్తి కాదు.
ఇటువంటి సినిమాకు ప్లస్ లు, మైనస్,
మార్కుల కోసం చూడటం కంటే నేరుగా సినిమా చూసి తెలుసుకోవడమే భావ్యంగా ఉంటుంది. డాక్టర్
రాజశేఖర్ సినీ కెరీర్ కు ఈ సినిమా మళ్ళీ బూస్టింగ్ ఇచ్చిందని చెప్పవచ్చు.