ఆ స్టేజ్ ఎప్పుడో దాటేశాను: రజనీ

Saturday Oct 28, 2017
Rajanikanth 2.0 movie audio launch  dubai original

రజనీకాంత్, అమీ జాక్సన్ జంటగా నటించిన 2.0 చిత్రం ఆడియో రిలీజ్ వేడుక నిన్న దుబాయ్ లో ఘనంగా జరిగింది. ఆ సందర్భంగా రజనీకాంత్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకొంది..అందరినీ ఆలోచింపజేసింది. “ఇన్నేళ్ళ తరువాత కూడా నాకు ఇండస్ట్రీలోకి వచ్చి ఇంకా నాలుగైదేళ్ళే అయిన భావన కలుగుతుంటుంది. అంతవేగంగా రోజులు దొర్లిపోతున్నాయి. నేను కొత్త సినిమా చేస్తున్న ప్రతీసారి కూడా దీనితో నా కెరీర్ ముగిసిపోతుందనుకొంటాను కానీ ఎప్పటికప్పుడు పొడిగింపు లభిస్తూనే ఉంది. ఇది ప్రేక్షకుల అభిమానం, దీవెనలు, పైనున్న ఆ దేవుడి కృపవల్లనే సాధ్యం అవుతోందని నేను గట్టిగా నమ్ముతున్నాను.

సినిమాలు చేయడం ద్వారా బోలెడంత డబ్బు, కీర్తి ప్రతిష్టలు లభిస్తున్న మాట వాస్తవం. ఒకప్పుడు వాటి కోసం పడిన ఆరాటం తలుచుకొంటే ఇప్పుడు నవ్వొస్తోంది. మొదట్లో వాటిని చూసి సంతృప్తి, ఆనందం పొందినా ఇప్పుడవి కూడా పెద్దగా ప్రాముఖ్యత లేనివిగా అనిపిస్తుంటాయి. వాటిని చూసి పొంగిపోయే స్టేజ్ ని నేను ఎప్పుడో దాటేశాను.

మనం మంచి సినిమాలు తీద్దాం. తీసేవారిని ప్రోత్సహిద్దాం.. మంచి నటులను ప్రోత్సహిద్దాం. ఎంత ఎత్తుకు ఎదిగినా మనం మన సంస్కృతీ సాంప్రదాయాలను, విలువలను మరిచిపోకూడదు..త్యజించకూడదు. వాటిని మనం అనుసరించినంతకాలమే మనకూ ఒక విలువ, గౌరవం ఉంటాయి. అయితే దురదృష్టవశాత్తు ఈకాలం యువత వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. వారు ఆవిధంగా వ్యవహరించడం సరికాదు. మన సంస్కృతీ సాంప్రదాయాలలో గొప్పదనాన్ని తెలుసుకొని అర్ధం చేసుకోగలిగితే వాటిని ఆస్వాదించవచ్చు,” అని రజనీకాంత్ అన్నారు.

ఇది చదివారా?  నాన్న కూచి నిహారిక త్వరలో...