హమ్మయ్యా.. రాజుగారి గది తెరుచుకొంది

Thursday Oct 12, 2017
Raju gari gadhi 2 press meet original

ఓంకార్ దర్శకత్వంలో నాగార్జున, సమంత ప్రధానపాత్రలలో నటించిన ‘రాజుగారి గది-2’ చిత్రం రేపు విడుదల కాబోతున్నా ఇంతవరకు ఆ సినిమాను ప్రమోషన్ కార్యక్రమం నిర్వహించలేదేమని అనుకొంటుంటే, గురువారం సాయంత్రం వారిరువురితో సహా ఆ చిత్ర బృందంలో ముఖ్యులు అందరూ కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొని ఆ సినిమా గురించి చాలా కబుర్లే చెప్పారు.

ఈ సినిమా గురించి నాగార్జున, దర్శకుడు ఓంకార్ కూడా అనేక ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ముందుగా దర్శకుడు ఓంకార్ ఏమి చెప్పారో చూద్దాం.

“ఏ దర్శకుడికైనా మంచి పేరున్న పెద్ద హీరోలతో సినిమాలు తీయాలనే కోరిక తప్పకుండా ఉంటుంది. నాకు ఆ కోరిక ఉండేది. అది ఈ సినిమాతో తీరింది. నేను అక్కినేని హీరోలకు వీరాభిమానిని. నాకు మొట్టమొదటే నేను ఎంతో అభిమానించే నాగార్జున వంటి గొప్ప నటుడితో సినిమా చేసే అవకాశం కలగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈ కధ చెప్పగానే నాగార్జున వెంటనే ఒప్పేసుకోవడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అయితే ఆయన ముందే ఒకమాట చెప్పారు. కధను తనకు సంతృప్తి కలిగేవరకు మార్పులు చేర్పులు చేయాలని చెప్పారు. అలాగే ఇద్దరం మాట్లాడుకొని ఇంప్రూవ్ చేశాము. ఆ తరువాత సినిమా షూటింగ్ పూర్తయ్యేవరకు ఆయన ఒక్కసారి కూడా కలుగజేసుకోలేదు. అంత పెద్ద నటుడై ఉండి కూడా నేను ఎలాగా చెపితే అలాగ చేసుకుపోయేవారు.అయన తీరు చూస్తే నాకే చాలాసార్లు ఆశ్చర్యం కలిగేది. ఒక్కోసారి నేను నాగార్జుననే డైరెక్ట్ చేస్తున్నానా లేక మరేవరినైనానా? అనే అనుమానం కలిగేది. అంతగా ఆయన కో-ఆపరేట్ చేశారు. ఆయనతో సినిమా చేయడం ఎంత గొప్పగా ఉంటుందో నేను మొదటిసారి అనుభవపూర్వకంగా తెలుసుకొన్నాను. ఒక చిన్న డైరక్టర్ నయినా నన్ను ఆయన అంతగా గౌరవించి, సహకరించి, ప్రోత్సహించుతూ సినిమా పూర్తి చేయించడం నా అదృష్టమేనని భావిస్తున్నాను. ఆయన రామ్ గోపాల్ వర్మ మొదలు ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన గొప్ప వ్యక్తి. చిన్న డైరక్టర్ నైనా నాపై ఎంతో నమ్మకంతో ఈ సినిమా చేశారు. ఈ సినిమాతో నాకు కూడా అయన గొప్ప అవకాశం ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకొన్నాననే నేను భావిస్తున్నాను. నా అభిప్రాయం నిజమేనని రేపు సినిమా రిలీజ్ అయిన తరువాత అందరూ అంగీకరిస్తారు. నాగార్జునగారు తన కెరీర్ లో ఇంతవరకు ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేశారు. ఈ సినిమా ఆయన కెరీర్ లో మరొక మైలురాయిగా నిలిచిపోతుందని. అంత బాగుంటుంది ఈ సినిమా అందులో ఆయన పాత్ర,” అని ఓంకార్ అన్నారు.

ఇక సినిమా గురించి, దానిలో సమంత పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. “పివివి గారు మలయంలో విడుదలైన ‘ప్రేతం’ మూవీని నాకు పంపించి చూసి చెప్పమన్నారు. అది చూసిన తరువాత ఈ సినిమా రీమేక్ చేయవచ్చు కానీ దానిలో కేవలం 25-30 శాతం మాత్రమే మనకు పనికి వస్తుందని చెప్పాను. దానినే మన తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్పు చేశాను. దానినే అక్కినేని నాగార్జున, సమంత ఇమేజ్, వారి అభిమానులను దృష్టిలో పెట్టుకొని వారి పాత్రలు, కధను తీర్చిదిద్దాను. ఇక ఒరిజినల్ వెర్షన్ లో అసలు సమంత పాత్రే లేదు కానీ దీనిలో నేను యాడ్ చేశాను. దానిని ఆమె చాలా అద్భుతంగా చేసింది. ఆమె ఎంత అద్భుతంగా చేసిందో రేపు అందరూ చూస్తారు. 

ఈ సినిమాకు అబ్బూరి రవిగారు వ్రాసిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఆయన డైలాగ్స్ వ్రాసేసి తన పనైపోయిందని చేతులు దులుపుకోకుండా, సినిమా పూర్తయ్యే వరకు నా పక్కనే ఉంటూ నేను ఎలా కావాలనుకొంటే అలాగ వ్రాసి అందించేవారు. ఆయన అందించిన సహకారాన్ని మరిచిపోలేను. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ఇక పివివి గారు ఎప్పుడూ హాయిగా నవ్వుతూ నన్ను మోటివేట్ చేస్తుండేవారు. నిరంజన్ రెడ్డిగారు నన్ను ఒక తండ్రిలాగా గైడ్ చేసేరు. టెక్నీషియన్స్ అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులలాగ కలిసి మెలిసి పనిచేస్తూ ఏమాత్రం కష్టమనిపించకుండా హాయిగా సినిమాను పూర్తి చేసేశారు. అందుకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ఈ సినిమా కోసం పనిచేసిన వారందరికీ ఇదొక మైలురాయిగా మారబోతోందని నేను ఖచ్చితంగా చెప్పగలను. రేపు ఈ సినిమా విడుదలైతే నేను చెప్పినవన్నీ నిజమేనని అందరూ తప్పకుండా అగీకరిస్తారు.” అని దర్శకుడు ఓంప్రకాష్ ముగించాడు.