రంగస్థలం శాటిలైట్ రైట్స్ అంత పలికిందంటే...

Saturday Nov 04, 2017
Rangasthalam 1985 original

రామ్ చరణ్ తేజ్, సమంత జంటగా నటిస్తున్న రంగస్థలం 1985 చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. త్వరలోనే హనీమూన్ ముగించుకొని వచ్చి సమంత కూడా దానిలో చేరుతుంది. ఈ సినిమా లొకేషన్ కు సంబంధించి కొన్ని ఫోటోలను రామ్ చరణ్ తేజ్ ఇటీవలే తన అభిమానులతో షేర్ చేసుకొన్నాడు. ఆ సినిమా గురించి తాజాగా మరో ఆసక్తికరమైన వార్త వినపడుతోంది. ఆ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ అప్పుడే మొదలయిందని, దాని శాటిలైట్ రైట్స్ ఏకంగా రూ.16 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. రంగస్థలం 1985 జనవరి 11న విడుదల కావలసి ఉంది కానీ మార్చి 29కి వాయిదాపడినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే రిలీజ్ వాయిదా గురించి దర్శకనిర్మాతలు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు కనుక జనవరి 11న విడుదలవుతుందని భావించవలసి ఉంటుంది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతున్నప్పటికీ దాని శాటిలైట్ రైట్స్ ఇంతధరకు అమ్ముడుపోవడం చూస్తే, ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ పల్లెటూరులో చెవిటి యువకుడిగా నటించడం అందుకు ఒక కారణమైతే, అక్కినేని ఇంట్లో పెద్ద కోడలుగా అడుగుపెట్టిన సమంత హీరోయిన్ గా నటిస్తుండటం మరో కారణం అయ్యుండవచ్చు.

సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో చిరంజీవి భార్య సురేఖ నిర్మిస్తున్నారు. జగపతిబాబు, ఆది పినిశెట్టి, అనసూయ, గౌతమి, రంభ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. పూజా హెగ్డే ఐటెం సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతోంది. ఈ సినిమాకు కెమెరా: ఆర్.రత్నవేలు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.

ఇది చదివారా? పవన్ తో త్రివిక్రమ్ సెల్ఫీ..అదుర్స్