లక్ష్మీ పార్వతిగా రోజా?

Wednesday Oct 11, 2017
Lakshmi parvathi roja original

వివాదాల వర్మ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేత రాకేశ్ రెడ్డితో కలిసి నిర్మించబోతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో అత్యంత కీలకమైన లక్ష్మీ పార్వతి పాత్రను నటి, ప్రస్తుత వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా నటించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రామ్ గోపాల్ వర్మ నిన్న రోజా స్వంత జిల్లా అయిన చిత్తూరులో నిర్మాత రాకేశ్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడినప్పుడు, విలేఖరులు దీని గురించి అడిగిన ప్రశ్నకు నేరుగా ‘అవును.. కాదు’ అని సమాధానం చెప్పకుండా ‘ఇంకా ఎవరి పేర్లను ఖరారు చేయలేదు. చేస్తే తప్పకుండా చెపుతాను’ అని సమాధానం చెప్పారు. ఈ సినిమాలో స్వర్గీయ ఎన్టీఆర్ పాత్రను ప్రకాష్ రాజ్ నటించబోతున్నట్లు వచ్చిన వార్తలను గట్టిగా ఖండించిన రామ్ గోపాల్ వర్మ, రోజా విషయంలో విలేఖరుల ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకపోవడంతో ఈ వార్తలు నిజమేనని భావించవలసివస్తోంది.

నిజజీవితంలో లక్ష్మీ పార్వతికి, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుపై ఎంత కోపం ఉందో రోజాకు కూడ అంతే ఉంది. వారు ముగ్గురికీ ఆయనే ఉమ్మడి శత్రువు. పైగా ఈ సినిమాను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతే తీస్తున్నారు. అది సరిగ్గా వచ్చే ఎన్నికలకు ముందు విడుదల చేస్తామని వర్మ నిన్ననే ప్రకటించాడు. కనుక ఈ సినిమాలో రోజా నటించడానికి ఈ కారణాలన్నీ చాలు. ఒకవేళ ఈ వార్తలు నిజం చేస్తూ ఆమె లక్ష్మీ పార్వతి పాత్రలో నటిస్తే దానిలో జీవించేసి రక్తి కట్టించడం ఖాయం.