సమంత ఇంటిపేరు మార్చుకొందహో..

Wednesday Oct 11, 2017
Chaitu samantha3 original

మన దేశంలో హిందూ స్త్రీలు పెళ్ళయిన తరువాత తమ పుట్టినింటి పేరును విడిచిపెట్టి తమ భర్త ఇంటిపేరును స్వీకరించడం ఆనవాయితీ. జన్మతః క్రీస్టియన్ అయిన నటి సమంత రుత్ ప్రభు, ఇటీవల నాగ చైతన్యను వివాహం చేసుకొన్నాక ఆమె కూడా తన పేరును మార్చుకొంది. నిన్నటి వరకు కూడా ట్విట్టర్ లో ‘సమంత రుత్ ప్రభు’ అనే ఉండేది. దానిని ఆమె ‘సమంత అక్కినేని’ గా మార్చుకొంది.

ఆమె పేరును, మతాన్ని మార్చుకోమని అక్కినేని కుటుంబ సభ్యులు ఎవరూ కోరలేదు కానీ ఆమె తనంతట తానే పేరు మార్చుకొని ఇక నుంచి తనను అక్కినేని ఇంటి కోడలుగా అందరూ గుర్తించాలని సూచించినట్లుంది. అక్కినేని కుటుంబ సభ్యులు ఆమెను యధాతధంగా తమ కుటుంబ సభ్యురాలిగా స్వీకరించి తమ హుందాతనాన్ని చాటుకోగా, ఆమె కూడా తన పేరు మార్చుకొని హుందాతనం ప్రదర్శించింది.

నాగ చైతన్యతో పెళ్ళి నిశ్చయం కాగానే పెళ్ళయిన తరువాత ఆమె సినిమాలు చేయడం మానేస్తుందని మీడియాలో చాలా ఊహాగానాలు వచ్చాయి. కానీ సరిగ్గా పెళ్ళికి ముందే ఆమె తనకు కాబోయే మావగారైన నాగార్జునతో కలిసి ‘రాజుగారి గది-2’ లో నటించింది. పెళ్ళయిన తరువాత కూడా వరుసగా చాలా సినిమాలు చేయబోతోంది. అక్కినేని కుటుంబ సభ్యులు ఎవరూ ఆమెకు ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడం అభినందనీయమైనదే.   

నాగార్జున, సమంత నటించిన రాజుగారి గది-2 శుక్రవారం విడుదలకాబోతోంది. సమంత, విజయ్ (తమిళ నటుడు) కలిసి నటించిన ‘అదిరింది’ చిత్రం దీపావళికి విడుదల కాబోతోంది. హనీమూన్ నుంచి తిరిగివచ్చిన తరువాత రామ్ చరణ్ తేజ్ తో కలిసి రంగస్థలం-1985 లో తన పాత్రను పూర్తి చేయవలసి ఉంది. అదిగాక మహానటి సావిత్రి జీవితకధ ఆధారంగా రూపొందుతున్న ‘సావిత్రి’ సినిమాను పూర్తిచేయవలసి ఉంది. ఈలోగా మరికొన్ని కొత్త సినిమాలకు ఒప్పుకొన్నట్లయితే, హనీమూన్ నుంచి తిరిగి రాగానే సమంత మళ్ళీ ఫుల్ బిజీ అయిపోవడం ఖాయం.