కొత్త పెళ్ళికూతురు సమంత చెప్పిన కబుర్లు విన్నారా?

Thursday Oct 12, 2017
Rgg pressmeet original

ఓంకార్ దర్శకత్వంలో నాగార్జున, సమంత ప్రధానపాత్రలలో నటించిన ‘రాజుగారి గది-2’ చిత్రం రేపు విడుదల కాబోతున్నా ఇంతవరకు ఆ సినిమాను ప్రమోషన్ కార్యక్రమం నిర్వహించలేదేమని అనుకొంటుంటే, గురువారం సాయంత్రం వారిరువురితో సహా ఆ చిత్ర బృందంలో ముఖ్యులు అందరూ కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొని ఆ సినిమా గురించి చాలా కబుర్లే చెప్పారు.

ముందుగా కొత్త పెళ్ళి కూతురు సమంత ఏమి చెప్పిందో వినాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది కనుక అదే చెప్పుకొందాము.

“మా పెళ్ళి సమయంలో మమ్మల్ని సోషల్ మీడియా ద్వారా, ఫోన్ల ద్వారా ఆశీర్వదించిన వారందరికీ, మా పెళ్ళి ఫోటోలను, వీడియోలను అపురూపంగా అందరితో పంచుకొన్న మీడియావారికి, మా అభిమానులకు, ప్రజలందరికీ ముందుగా కృతజ్ఞతలు చెప్పుకొంటున్నాను. మీ అందరి ఆదరణ చూస్తే నాకు మీరందరూ ‘ఎక్స్ టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్’ లాగ అనిపిస్తున్నారు. మాపై మీరు చూపించిన ఈ ప్రేమ, అభిమానానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.

తరువాత సినిమా గురించి మాట్లాడుతూ, “ఈ సినిమా గురించి అందరూ ఇంత పాజిటివ్ గా మాట్లాడుతుంటే నాకు దాని గురించి మాట్లాడటానికి భయమేస్తోంది. ఎవరైనా నన్ను కాస్త భయపెట్టారా ప్లీజ్?” అని అనగానే అందరూ గొల్లున నవ్వారు.      

“నేను అనేక సినిమాలలో ప్రధానపాత్ర పోషించాను. కొన్నిటిలో మొదటి నుంచి చివరి వరకు కనిపించినా అందులో నేను ఎందుకు ఉన్నానో కూడా తెలియని పాత్రలు చేశాను. కానీ ఈ సినిమాలో నా పాత్ర చిన్నదే అయినా దానికి చాలా ప్రాధాన్యత ఉందని గుర్తించి చేశాను. ఈ సినిమాలో నా పాత్ర మన సమాజంలో అమ్మాయిలందరికీ ప్రతీక వంటిది. ఆ పాత్రలో విషాద సన్నివేశాలు చేస్తున్నప్పుడు నేను కంట్లో గ్లిజరిన్ వేసుకోలేదు నిజంగానే చాలా బాధతో నాకు తెలియకుండానే కన్నీళ్లు కారిపోయేవి. ప్రతీ అమ్మాయి ఆ పాత్రతో మమేకం అవుతుందని నేను నమ్ముతున్నాను. అంత డెప్త్ ఉన్న పాత్ర నాది. ఇది మంచి మెసేజ్ ఉన్న సినిమా అని చెప్పాలనుకొంటున్నాను కానీ నా వెనక వెన్నెల కిషోర్, ప్రవీణ్ వంటి కమెడియన్లు కూర్చొని ఉంటే ఎలా చెప్పగలను?” అనే సరికి మళ్ళీ అందరూ గొల్లున నవ్వారు.

“రోజూ అనేక సినిమాలు చేస్తుంటాము. వాటిలో కొన్ని హిట్ అవుతుంటాయి. కొన్ని ఫ్లాప్ అవుతుంటాయి. హిట్ అయినా ఫ్లాప్ అయినా వాటి గురించి కొన్ని రోజులే మాట్లాడుకొంటాము. కానీ ఈ సినిమా చేయడం మాత్రం నాకు ఒక గొప్ప అందమైన అనుభూతిని, అనుభవాన్ని మిగిల్చిందని చెప్పగలను. అందరూ ఇంత పాజిటివ్ గా, ఇంత సరదాగా, ఉత్సాహంగా ఒక కుటుంబ సభ్యులలాగ కలిసిమెలిసి పనిచేయడం నాకు చాలా ఆనందం కలిగించింది. ఈ అనుభూతి చాలు నాకు.”

ఇక చివరిగా ఒక విలేఖరి “అక్కినేని కుటుంబానికి సినీ నిర్మాణం, స్టూడియో నిర్వహణ, ప్రొడక్షన్ హౌస్ పనులు వంటివి అనేకం ఉన్నాయి. మీరు అక్కినేని కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టారు కనుక మీరు కూడా ఆ బాధ్యతలు పంచుకొంటారా?” అనే ప్రశ్నకు మొదట ఏమి సమాధానం చెప్పాలో తెలియక పక్కనే కూర్చొన్న మావగారు నాగార్జున వైపు చూసింది. కానీ ఆయన కూడా చాలా రిలాక్స్డ్ గా నవ్వుతూ చూస్తూ కూర్చున్నారే గానీ ఏమీ చెప్పలేదు. దానితో సమంత చాలా ఆచితూచి చక్కగా సమాధానం చెప్పింది.

“అవును నేను చాలా గొప్ప పేరున్న అక్కినేని ఇంటి కోడలినయ్యాను. అక్కినేని కుటుంబంలో అమ్మాయిలను కూడా సరిసమానంగానే గౌరవిస్తారు. అమల, సుప్రియలు మంచి వ్యక్తిత్వం, స్వతంత్ర భావాలున్నవారు. అదే నాకు ఒక దీవెనగా, వరంగా భావిస్తాను. వారు ఎవరినీ ఏదీ చేయమని అడగరు. ఒత్తిడి చేయరు. కానీ నాపై నేనే ఒత్తిడి చేసుకొంటున్నట్లు నాకు అనిపించింది. నేను అక్కినేని సమంతనయ్యాను కనుక ఆ ఇంటి గౌరవం, ప్రతిష్ట కాపాడవలసిన బాధ్యత నాపై ఉందని తెలుసు. అందుకు అనుగుణంగానే నడుచుకొంటాను,” అని సమాధానం చెప్పింది.

ఈ సినిమా గురించి నాగార్జున, దర్శకుడు ఓంకార్ కూడా అనేక ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. అవి వేరేగా ఇస్తున్నాము.