'లక్ష్మీస్ ఎన్టీఆర్' కు సీక్వెల్ కూడా తీస్తాడా?

Tuesday Oct 10, 2017
Ram gopal varma ntr biopic original

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవితకధ ఆధారంగా త్వరలో లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే సినిమా తీయడానికి సన్నాహాలు చేసుకొంటున్న సంగతి తెలిసిందే. దాని గురించి ఆయన నిన్న మరికొన్ని విశేషాలు చెప్పారు.  ఈరోజు చిత్తూరు జిల్లాలో పలమనేరులో నిర్మాతతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ, “ఎన్టీఆర్ జీవితచరిత్ర మహాభారతం అంత పెద్దది..విస్తారమైనది. దానిని మహాభారతంలాగ 18 పర్వాలలో తీసినా ఇంకా చెప్పవలసిన విషయాలు చాలా మిగిలిపోతాయి. నేనిప్పుడు దానిలో ఒక భాగం మాత్రమే తీసుకొని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. దానిలో ఏపి సిఎం చంద్రబాబు నాయుడిను విలన్ గా చూపిస్తానా..లేదా..అనేది నేను ఇప్పుడే చెప్పలేను. ఈ సినిమాను 2018 అక్టోబర్ లో విడుదల చేస్తాం,” అని చెప్పారు. 

 ఎన్టీఆర్ జీవితంలో అత్యంత వివాదాస్పదమైన ఆ భాగాన్నే ఎందుకు సినిమాగా తీయలనుకొంటున్నారు? అనే విలేఖరుల ప్రశ్నకు సమాధానం చెపుతూ, “ఎన్టీఆర్ సినీ జీవితం గురించి అందరికీ తెలుసు. అలాగే ఆయన రాజకీయ ప్రస్తానం గురించి అందరికీ తెలుసు. కానీ లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలో ప్రవేశించినప్పటి నుంచి ఆయన చనిపోయేవరకు ఆయన జీవితంలో, పార్టీలో, రాష్ట్ర రాజకీయాలలో ఊహించని అనేకపరిణామాలు జరిగాయి. ఆయన జీవితంలో ఆ చిన్న భాగంలోనే రసవత్తరమైన ఈ ఘటనలన్నీ జరిగాయి కనుక అవే సినిమాకు సరిపోతాయనే ఉద్దేశ్యంతోనే వాటి ఆధారంగా సినిమా తీస్తున్నాను,” అని చెప్పారు.

ఈ సినిమాకు నిర్మించదానికి వచ్చిన రాకేశ్ రెడ్డి రాజకీయనాయకుడని ముందు తనకు తెలియదని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. అలాగే ఫిభ్రవరిలో షూటింగ్ మొదలుపెట్టాలనుకొంటున్నాము కనుక అది వచ్చే ఆగస్ట్-సెప్టెంబర్ సమయానికి పూర్తయ్యే అవకాశం ఉంది కనుక అక్టోబర్ లో విడుదల చేస్తానని చెప్పాను తప్ప ఎన్నికలను, రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ఆ నిర్ణయం తీసుకోలేదని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. 

మహాభారతం వంటి ఎన్టీఆర్ జీవితచరిత్రలో ఒక్క భాగం మాత్రమే ఇప్పుడు చూపిస్తున్నాను అని వర్మ చెప్పడం గమనిస్తే, ఇప్పుడు తీస్తున్న ఈ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ హిట్ అయినట్లయితే, ఎలాగూ నిర్మాత సిద్దంగానే ఉన్నారు కనుక దానికి సీక్వెల్ తీసే అవకాశం ఉందని ఆయన సూచిస్తున్నట్లున్నారు.