పాపం సిద్ధూ..

Friday Nov 03, 2017
Gruham original

 సినీ నిర్మాణంలో వివిధ శాఖల పనితీరుపై మంచి అవగాహన ఉన్న నటుడు సిద్దార్థ. అతను స్వయంగా ప్రొఫెషనల్ సింగర్ కు తీసిపోనివిధంగా చక్కగా పాటలు పాడుతాడు. డైరెక్షన్, స్క్రీన్-ప్లేలో మంచి అనుభవం ఉంది. తెలుగు, తమిళ చిత్రాలే కాకుండా హిందీలోను నటిస్తుంటాడు కనుక బాలీవుడ్ తో కూడా మంచి పరిచయాలున్నాయి. కనుక ధైర్యంగా తెలుగు, తమిళ్, హిందీ బాషలలో ఒక హర్రర్ సినిమా తీశాడు. అది ఈరోజు విడుదలకావలసి ఉంది. అయితే హిందీ, తమిళ్ వెర్షన్స్ విడుదలచేయగలిగాడు కానీ గృహంపేరుతో తీసిన తెలుగు వెర్షన్ విడుదల చేసుకోలేకపోయాడు. కారణం..ధియేటర్లు లభించకపోవడమేనని తెలుస్తోంది.

ఈరోజు డాక్టర్ రాజశేఖర్ నటించిన పి.ఎస్.వి. గరుడవేగ, హెబ్బా పటేల్ ప్రదానపాత్రలో నటించిన ఏంజల్,       ఆది నటించిన నెక్స్ట్ నువ్వే సినిమాలు విడుదలయ్యాయి. అయితే పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి ఎప్పుడు ఎన్ని ధియేటర్లు కావాలంటే అన్ని దొరుకుతున్నప్పుడు సిద్ధూ సినిమాకు ఎందుకు దొరకలేదనేదే ప్రశ్న. ఇప్పుడు పెద్ద హీరోలు..వారి కొడుకులు..మేనల్లుళ్ళు కూడా వరుసపెట్టి సినిమాలు చేస్తుండటంతో రెండు తెలుగు రాష్ట్రాలలో చిన్న సినిమాలకు ఇటువంటి పరిస్థితి తరచూ ఎదురవుతూనే ఉంది. ఈ పరిస్థితి ఎప్పటికైనా మారుతుందా లేక ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుందో తెలియదు.

గృహంసినిమాలో ఆండ్రియా కధానాయికగా నటించింది. మిలింద్ రావు దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో సిద్ధార్ద నటించడమే కాకుండా దర్శకత్వం కూడా చేయడం విశేషం. ఈ సినిమాకు సంగీతం: గిరీష్, కెమెరా: శ్రేయాస్ కృష్ణ, ఎడిటింగ్: లారెన్స్ కిశోర్ చేశారు.  

 ఇది చదివారా? ఖాకి ఆడియో విడుదల