డాక్టర్ రాజశేఖర్..ఇదేమిటి సార్?

Tuesday Oct 10, 2017
Garuda vega first look original

డాక్టర్ రాజశేఖర్ నటిస్తున్న గరుడవేగ చిత్రంలో ఆయన దేశాన్ని కాపాడే ఒక సాహసవంతుడైన గూడఛారిగా చేశారు. కానీ మొన్న ఆదివారం రాత్రి జరిగిన చిన్న రోడ్డు ప్రమాదంతో ఆయన నిజజీవితంలో సమస్యలను ఎదుర్కోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకొన్న ఒక పిరికివాడని నిరూపించినట్లయింది.

ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన కారులో ఇంటికి వస్తుంటే పొరపాటున తన ముందు వెళుతున్న కారును డ్డీకొన్నట్లు మొదట సమాచారం వచ్చింది కానీ అది నిజం కాదని తేలింది. కొన్ని రోజుల క్రితమే అయన తల్లి మరణించారు. అప్పటి నుంచి ఆయన చాలా దిగులుగా ఎవరితో మాట్లాడకుండా ముభావంగా ఉంటున్నారని ఆయన భార్య జీవిత స్వయంగా మీడియాకు తెలిపారు. మొన్న ఆదివారంనాడు ఆయనను మాట్లాడించబోగా ఆయన ఆగ్రహంతో కారు తీసుకొని ఇంటిలో నుంచి వెళ్ళిపోయారని ఆమె తెలిపారు. కారులో బయటకు వెళ్ళేటప్పుడు ఆయన నిద్రమాత్రలు కూడా తిన్న సంగతి పోలీసుల విచారణలో బయటపడింది. తల్లిపోయిన బాధతో ఆయన డిప్రెషన్ తో ఉన్నారని జీవిత తెలిపారు. అందుకే నిద్ర మాత్రలు వేసుకొన్నారని ఆమె తెలిపారు.

ఆ ప్రమాదంలో దెబ్బతిన్న కారు యజమాని రామిరెడ్డి ఈ విషయం తెలుసుకొన్న తరువాత తన కేసును ఉపసంహరించుకోవడంతో ఆ సమస్య అక్కడితో ముగిసింది. కానీ సినిమాలలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించే డాక్టర్ రాజశేఖర్ ఈ చిన్నఘటనతో ఎంత బలహీన మనస్కుడో బయటపడింది.

తల్లిని కోల్పోతే ఎంతటివారికైనా బాధాకరమే కానీ ప్రతీ మనిషి జీవితంలో ఇవి అనివార్యమైన పరిణామాలే. కొన్ని కోట్లమంది ఇంతకంటే దారుణమైన పరిస్థితులలో జీవిస్తున్నారు. చనిపోతున్నారు. వారితో పోలిస్తే డాక్టర్ రాజశేఖర్ కు వచ్చిన కష్టం చాలా చిన్నదేనని చెప్పవచ్చు. కనుక జీవితంలో ఈ చేదు సత్యాలను అంగీకరించి ఆ బాధను, దుఃఖాన్ని ద్రిగమింగి ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక సినీ హీరోగా ముందుకు సాగాలి. కానీ డాక్టర్ రాజశేఖర్ అందుకు భిన్నంగా వ్యవహరించారు. ఒకవేళ తనకు ఏమైనా అయితే తన భార్యాపిల్లలను ఎవరు చూసుకొంటారని ఆయన ఒక్కసారి ఆలోచించి ఉండి ఉంటే ఇటువంటి సాహసం చేసి ఉండేవారు కారు.   

సినిమాలలో హీరోలుగా కనిపించడం కంటే నిజజీవితంలో హీరోగా నిలబడగలిగినప్పుడే ఎవరికైనా గౌరవం, మర్యాద లభిస్తాయని మరిచిపోకూడదు. ఏమైనప్పటికీ డాక్టర్ రాజశేఖర్ ఈ శ్మశాన వైరాగ్యం నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. ఆయన మళ్ళీ ఒక మంచి భర్తగా, గొప్ప తండ్రిగా, గొప్ప హీరోగా పేరు సంపాదించుకోవాలని కోరుకొందాం.