ఆ ఐడియా వర్కవుట్ అయినట్లే ఉంది కదా..

Tuesday Sep 12, 2017
Ninnu kori original

వంద, రెండొందల కోట్లు పెట్టుబడి పెట్టి తీసే సినిమాలలో పాటలు, ఫైట్స్ కోసం విదేశాలలో అద్భుతమైన లోకేషన్స్ లో షూటింగ్ చేయడం మామూలే. అయినా అవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోర్లపడుతుంటాయి. అదే చిన్న బడ్జెట్ తో తీస్తున్న చిన్న సినిమాలు బాక్స్ ఆఫీసులను బద్దలు కొడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఫిదా, నిన్ను కోరి సినిమాలు ఎంత గొప్ప విజయం సాధించాయో అందరూ చూశారు.
ఆ రెండు సినిమాలలో ఒక కామన్ పాయింట్ ఉంది. ఆ రెండూ చాలా వరకు అమెరికాలో చిత్రీకరించబడినవే. ఆ కారణంగా వాటితో అమెరికాలో స్థిరపడిన తెలుగువారు చాలా సులువుగా కనెక్ట్ అవగలుగుతారు కనుక అక్కడ షూటింగ్ చేయాలనుకొన్నప్పుడే ఆ సినిమాలు సగం విజయం సాధించినట్లు చెప్పవచ్చు. అయితే రెంటిలో కధ కూడా బలంగా ఉండటం, టెక్నికల్ వాల్యూస్, నటీనటుల పెర్ఫార్మెన్స్ వగైరా అన్నీ బాగుండటంవంటి అనేక కారణాలు కూడా ఉన్నాయి. అమెరికాలో తెలుగువారితో సులువుగా కనెక్ట్ అయ్యి వారిని ఆకట్టుకొని సినిమాను విజయవంతం చేసుకోవడానికి ఇదీ ఒక సులువైన మార్గమని ఆ రెండు సినిమాలు నిరూపించిచూపాయి.
అయితే ఇటువంటి సినిమాలు ఇంతకు ముందు ఎన్నడూ రాలేదా? అవన్నీ ఎందుకు హిట్ కాలేదు? అంటే ఆ సినిమాలో పైన చెప్పుకొన్న మిగిలిన ఆ అంశాలన్నీ బలంగా లేకపోవడమే కారణమని చెప్పుకోవలసి ఉంటుంది. అమెరికాలో నాలుగు నగరాలను చూపించినంత మాత్రాన్న సినిమా హిట్ అయిపోదు కానీ దానికి కాస్త కధాబలం వగైరా దినుసులు కూడా జోడిస్తే తపకుండా గొప్ప విజయం సాధించగలవని మాత్రం రుజువయింది.
అమెరికాలో సినిమా తీయాలంటే బారీ బడ్జెట్ అవసరం లేదని కూడా ఈ రెండు సినిమాలు నిరూపించి చూపాయి. నేటి యువతరం దర్శకులు తక్కువ బడ్జెట్ తోనే అద్భుతమైన విజువల్స్, సంగీతం, మూస కధలకు పూర్తి భిన్నంగా సరి కొత్త కధాకధనాలు, ఆలోచనలతో అద్భుతంగా సినిమాలు తీస్తున్నారు. అందుకే ఇప్పుడు ఇక్కడ దేశంలో ఎంత బిజినెస్ జరుగుతోందో, ఓవర్సీస్ లో కూడా అంతే ధీటుగా బిజినెస్ జరుగుతోంది. ఫిదా, నిన్ను కోరి, అర్జున్ రెడ్డి సినిమా కలెక్షన్లే అందుకు తాజా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.
ఈ చిన్న, పెద్ద సినిమాల తీరును చూస్తుంటే, ఏదో ఒకరోజు చిన్న సినిమాలే పైచెయ్యి సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. అంతకాదు..మెల్లమెల్లగా తెలుగు సినీ పరిశ్రమలో మార్పు కూడా అనివార్యంగా కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు పెద్ద హీరోలు కూడా కొత్త దర్శకులతో చేయడానికి ధైర్యం చేస్తున్నారు. చిన్న హీరోలతో మల్టీ స్టార్ సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇది తెలుగు సినీ పరిశ్రమలో ఒక శుభపరిణామమే అని చెప్పవచ్చు.